Tuesday, July 31, 2012

పరుగెడుతున్న కాలం కిటికీ లోంచి


సూర్యున్ని వీపు మీద మోసుకొని
కన్నీళ్ళ కలలు కంటూ
నిర్వీర్య వీరుడవై
నమ్మకం పెచ్చులూడుతున్న
వయసు గాలుల్లో...


నీ మట్టుకు నీవు
కొట్టుకు పోతుంటావు


...ఓ కమ్మని పాటను
తయారుచేసుకున్న విలుకాడు
శబ్ద లయలలో పొదిగి
తడిసేలా నీ మనసు
విసురుకుంటూ పోతాడు


* * *


చిల్లర గాయాల్ని ఏరుకుంటూ
నీ పిల్లల భవిష్యత్తు పై చెయివేసి
నిమురుకుంటూ నీ దగ్గరికి లాక్కొని
నీ గుండె కొక్కాన్ని తగిలించి
ఊయలలూపుతూ ...


నీ మట్టుకు నీవు
ఉబలాట పడుతుంటావు




...చేమ్కీలతో కలిసిన వెన్నెల
రాత్రిని కాసేపాగమని
వేపచెట్టు గాలిని బతిమిలాడి
నీ తపనల తాపం మీదికి
ప్రవహించుకుంటూ పోతాది


* * *


సున్నపు గీతల గోడల మీద
నువు కలలు కన్నా చిత్రాలు
కనిపిస్తాయేమోనని వెతుక్కుంటూ
అద్దం లోని నీ మీద
అక్షింతలు చల్లుకుంటూ
నువు కుట్టుకున్న బతుకు
నెత్తిన పెట్టుకొని ...


నీ మట్టుకు నీవు
మునకలేస్తుంటావు


...ఓ చల్లని చెరుకు తేనె పాటను
పూసుకొని
ఏడేడు వర్ణాల నీకు
నచ్చిన వాటిని ఏరుకొని
నీ దాహం తిక మక పడేటట్టు
లేత వయసు చిగురుటాకుల
సొగసు కాలాన్ని నీకోసం
చెంచాడు చెంచాడు తినిపించడం కోసం
ఓ మల్లె నీచుట్టూ
వ్యాపించుకుంటూ పోతాది

      .....

Sunday, July 29, 2012

పోగుల పోగుల బాల్యం


మగ్గం చూడగానే
గుంటలో నుండి బాల్యం
పలకరిస్తుంది


నాయిన అందులో నుండి
కండె తెమ్మంటాడు
రాత్రి పగలు కరెంటు బుగ్గ కింద
మెరుస్తూ, జీవితాన్ని
మెట్టు మెట్టు కుదిరిచ్చుకుంటూ
తెగిన రోజును అతుక్కుంటూ
నన్ను నేసుకొచ్చాడు


తెల్లారగట్ల నన్ను
చదువుకోమని లేపినపుడు
ఆయన అప్పటికే పట్టు
దారాలతో ప్రకృతికి
రంగులద్దుతూ
నాడె విసిరి సూర్యుడికి దారం చుట్టేవాడు


అమ్మ రాట్నం చప్పుడు
గిర గిరా కలల లోకాన్ని
తిప్పి తిప్పి
దబుక్కున నేల మీద
నాన్న విసిరిన ఖాళీ
ఊస చప్పుడుకు రాలిపడి
పుస్తకాల నిద్ర ను తిరగేసుకుంటూ నేను


ఊరు
మగ్గం
నాన్న
నా బాల్యం
అన్ని కలిసిన రంగురంగుల
పూల వాసనల నిలువు పేకల నేత
కమ్మని ఇంట్లోంచి దొంగిలించి
సందులో సప్పరించిన
పిప్పరమెంటు గోలి.
.....

ఈ బ్రాంచిలో వాతావరణం మార్పు లేదు


నాకు అర్ధం కాని చాలా వాటిలో
నిన్నూకలుపుకున్నాను


అయినా ఇష్టం కంటే
ఒకడుగు ముందు వరుసలో
నిన్ను పలకరిస్తాను


నువు బహుకరించలేని
రంగులకల నాకు మాత్రం
ఎందుకు ?


బతుకంతా అందమైన పైంటింగ్ లా
అలంకరించాలంటావు


అందరికీ ఉండేవి మైనస్ చేస్తే
మిగిలేదే మనమంటే ఒప్పుకోవు


ఇప్పటి పూల మీద
వాలిపోవే సీతకోకచిలుకా


రేపటి పూసేవి మాట అటుంచు
ఇవి ముసలివైపోతాయి ...


మరణాన్ని రానివ్వని
రిఫ్రిజిరేటర్ ఇంకా
మార్కెట్ లో లేదు.
.....

Saturday, July 28, 2012

ధ్యానజీవులు



ఏమీ తోచనివ్వనిదనుకున్న 
సాయంత్రాన్ని కూడా 
నీ కోసం ప్రార్ధించుకోవడానికి
అలంకరించుకుంటాను 


ఓ చిత్తు కాగితం తీసుకొని 
నా చేతితో నీ జ్ఞాపకాన్ని రాసి 
పవిత్రపరుస్తాను 


నా చుట్టూ పెనవేసుకుపోయిన 
ప్రతిదీ నీ చేరువకి కదిలిస్తాను 
దీపం దగ్గర ఏదైనా ప్రకాశిస్తుంది కదా!


నన్ను కొన్ని ఆలోచనలు కూడా 
ఎక్కడో పడవేస్తాయి 
కొంత సమయం తర్వాత గానీ 
అక్కడికెందుకొచ్చిందీ తెలియదు 


కొందర్ని ఎందుకు కలుస్తామో కూడా 
అప్పుడే తెలియక పోవచ్చు 
వాళ్ళు నాటుకున్నాక.....కొంతకాలానికి 
ఓ పరిమళపు స్పర్శ 
బహుశా కలయికల సారం 
మొగ్గలు తొడగవచ్చు


అయితే...విత్తనాలు నాటిన స్నేహాలు 
పవిత్ర ధ్యాన మందిరాలు 
నీవంటివే. 


   .....

Wednesday, July 25, 2012

అనుకోని జీవితం



కిందపడి 
మీదపడి 
చెప్పాపెట్టక 
నీ దగ్గరికి వస్తే 
సందేహాల తాళం నవ్వింది 


కొన్ని అనుభవాలు 
విసురుకుంటూ వెళ్తున్ననీకు 
నా రసాయనిక మనసు చర్య 
తెలియదు 


దిక్కులేని ఆలోచనల్లో 
నడిపిస్తున్న నన్ను 
పడవేసి ,పాదాల మీదుగా 
ఓ యువకుడి వాహనం 
పరుగెడుతుంది 


నువు కలవర పెడుతున్న రాత్రి 
నాలుగక్షరాలు నీకోసం 
రాద్దామని కూచుంటే 
కరెంటు పోతుంది 


గాడిదయ్యో 
బూడిదయ్యో
బతుకుతూ ఉంటా ...కానీ ...కానీ 
వయసై పోతుంది.


     .....

Tuesday, July 24, 2012

పాత పద్యమొకటి పలకరించాక



పాత పుస్తకాలు దులుపుకుంటున్నప్పుడు
నీ కోసం రాసిన పద్యం జారి 
ఇంకా పరిమళించుకుంటో ... 


అక్షరమక్షరము తడుముకున్నా
నిష్క్రమించని తలపుల 
సమ్మోహ వాద్య తరంగాల దొంతరలు 
నను మీటుకుంటో ...


ఒకసారి నాచేతులు 
వణుకుని చుట్టుకొని 
వొంటి నిండా ప్రాకి 
ఎక్కడికి చేరుకోవాలో తెలియక 
భోరుమంటో ...


రెక్కలు పొడుచుకు రాని ప్రేమ 
రూపం కోల్పోయిన భయంతో 
పుట్ట్టుకతో అవయవాలు ఏర్పడని ధైర్యంతో 
ఉపయోగానికి ముందే శీకి పోయి 
ముట్టుకుంటే ఊసిపడుతున్న కాలంలో 
కుళ్ళుకుంటో ...


నిద్రని ,నిన్ను ,మధువును 
రోడ్డు మీద జారుకుంటూ పోయిన రాత్రినీ 
గడ గడా తాగి సొమ్మసిల్లిన 
సగం మెలుకువలో 
అక్కరకు రాని నీ సొగసును తిట్టుకుంటో ...


నక్కి నక్కి సాటుంగ  సాటుంగ 
వయసు రాని ఏడుపును 
ఎంతో ఎంతో వేడుకుంటో...


అప్పటికి అక్షరాల్లోకి అనువదించలేకపోయిన 
గడ్డకట్టిన ప్రేమ 
ఇప్పుడు కరుగుకుంటో ...


        .....

Sunday, July 22, 2012

సంచి సర్దుకో



గాలి పంఖాలతో పగలుని 
మత్తు గమనాలతో రాత్రిని 
సాగనంపుకుంటూ 


శ్వాసను మెల్లగా మెల్లగా 
మెట్లెక్కించుకుంటూ 
అటూ ఇటూ చెవులని 
చెంపదెబ్బలేసుకుంటూ


వస్తూ వస్తూ నీ సంచీలో వేసుకొచ్చిన  
ఇటుక కండరాల పేర్చుకుంటూ 
రంగు రంగు సబ్బు జిగటలతో రుద్దుకొని 
కొన్ని వాసనలతో కొన్ని మలినాలను దాచుకుంటూ


త్వరలో కూలిపోయే మహాసౌధానికి
భ్రుంగరాజ తైలం రుద్ది 
మెహందీ ముద్దలు దిద్ది 
త్తల త్తల ల షాంపూ నురగలతో 
ఇంకొకడిది కాదు ,నీ వాసనే నీకు చేరకుండా 
కల్మషం కడుక్కుంటూ 


ఎప్పుడూ ఉపవాసం చేయని వాడు 
వజ్ర కిరీటాలతో సంపన్నుల దర్శనానికి పోయి 
దుష్ట శిక్షణకి శ్రీకారం చుట్టే విధానం తెలియక 
తిక మక పడుతున్న వాడి మీద 
రంగుల కుంకుమ చల్లుకుంటూ 


తమ బీరువాలు ,ఖాతాలు ఎలా నిమ్పుకోవాలో 
వ్యాపారాలకు సంతానవృద్ధిచేసే 
సంబరాల్లో మునిగే 
అద్దంలో ప్రతిబింబం కూడా 
వారినే నమ్మని వారిని 
నిజాయితీ నవ్వు నవ్వలేని వారిని 
చప్పట్లతో ఊరేగించుకుంటూ 


సుఖంతో నిద్రిస్తున్న కుట్రలతో,కుతంత్రాలతో 
అనేక నేరాల దోపిడీల దొంగతనపు
భవంతుల మెట్ల మీద 
పూల కుండీల వెలిగించుకుంటూ 
రాలిపడే బిస్కట్లకు 
పోటీ పరీక్షలు రాసుకుంటూ 


టీవీ ఘుమఘుమల సీరియల్ వంటకాల్ని 
నోరుతెరిచి తలపులు మూసి 
చప్పరించుకుంటూ 
మాటలు సరిగారాని సినీ మహా మహా కురచనటుల 
కవచకుండలాల దుమ్ము భజనకు 
చప్పట్లు కొట్టుకుంటూ 


పట్టు వస్త్రాలు చుట్టుకున్న 
ఫంగస్ చర్మంతో 
దురద మీది ధ్యాసతో 
పిడచకట్టుక పోయిన గొంతుకు  
ఖరీదు మద్య్హం వాగ్దానంతో 
యజ్ఞం లో నీతిని కాల్చుకుంటూ 


కడుపులో మండిపోతున్న అల్సర్ల మీద 
ఆంటాసిడ్స్ తో ప్రదక్షిణ చేసుకుంటూ 
కొవ్వు తో పేరుకుపోయిన గుండెను 
మందు బిల్లలతో,టానిక్ బిటమిన్లతో
అల్లించుకుంటూ...


ఫో...
పోరా ఫో...
ఛీ...
ఇంతే నువ్వింతే
పది జన్మలెత్తినా పువ్వులా బతకలేవు 


          .....


Saturday, July 21, 2012

వాన మెతుకుల జీవ సారం



ఆగని వర్షపు గుభాళింపు 
కొండల మీదుగా సొగసుగా 
పరుగెత్తు కొచ్చిన ఆకుపచ్చ వాసన 
కళ్ళనిండా పూసిన తెల్ల మల్లె 


వేడి వేడి మంత్రం వేసే
ద్రవ రూప కౌగిలి 
ఎక్కడో మూలన రాతినరాల మధ్య 
చుట్ట చుట్టుకొని పడుకున్న 
పాము బుసల నడక 


జఠరాగ్నియజ్ఞంలో వేగుతున్న 
చిటపటల ఆకలి 
తడిసిన గాలిని విదిలిన్చుకుంటున్న 
పిల్లలకోడి 


కాన్వాస్ పై రంగులతో అలికింది 
పచ్చి పచ్చి కాలం 
చుక్కలతో మొరపెట్టుకున్న 
ముఖం కోల్పోయిన దిక్కులు 


అన్నిటినీ కుట్టిన 
నీటిమౌనం 


నిన్ను పరవశింప చేయగలనా?
పదేసి జన్మలెత్తినా...
వచ్చిందానివి  వచ్చావు 
చూడు ...ఈ భూమ్మీది ప్రాణం కంట నిండిన 
నమ్మకపు జల 


రాక రాక వచ్చావు .
అప్పుడప్పుడిలా నాలుగు రోజులుండి పో 
నీ కడుపున పుడతా మళ్లీ 
నా శతకోటి అందాల అద్దుకున్న   
సోర సోర అక్షరాలతో.




           .....

Friday, July 20, 2012

వానా కాలం నీకోసం ఓ సమయాన



ఒకసారి వచ్చిపోగలవని,ఏ రోజుకారోజు నిమురుకుంటూ 
నమ్మకానికి విసుగు కలగకుండా నమ్మిస్తూ 
గుండ్రంగా అన్నిదిక్కులకి ఆత్మను బొంగరం చేసుకొని 
ఓదార్చుకుంటూ,తిప్పతీగలా పెనవేసుకుంటూ 
తోచిన రాగాన్ని నిశ్శబ్దపు గొంతులో విసురుకుంటూ


వేపచెట్ట్టు గాలికి సాయంకాలం అందానికి పిచ్చుకల శబ్దాల అద్దుకొని 
తనని తాను మరిచిపోయే వేళ నేను ప్రవేశిస్తాను,
ఒకసారి తన కచేరీ వినిపిస్తూ పోయిన తుమ్మెద మళ్లీ రాదు 
కొన్ని చినుకులు నుదుటి మీద చల్లదనం వెలిగిస్తే 
కొన్ని సరాసరి దేహపు రాజు గుండె పచ్చిక బయల్లమీద 


వదిలెయ్ వదిలేయ్...!నువు వచ్చి చేసే గాయానికి 
రాకుండా చేసే వ్రణాలకి మాధుర్యం లో తేడా వుంది 
రస స్వీకారానికి అంకురాలు తపనని దోసిళ్ళతో నింపుకుంటున్నాయి 
నువు వస్తావని ...ఇంకొంత జీవితం దున్నుకొని వుంచాను 
రావని తెలిస్తే ...ఇంతటితో ఈ సౌందర్యానికి సెలవే.


                .....

నాలుగు మహా సముద్రాలు



అనుకోకుండా అక్కడికి చేరుకున్నాక మనసు వాలిపోయి 
ఒకప్పటి పురివిప్పుకున్న నది ఎముకలు తేలిపోయి 
పక్కనే పద్యాలతో భారతాన్ని చెక్కిన గది పాలిపోయి 
దుఃఖానికి చేరగిలి ,మహాకవి ఘంటం సాక్షిగా 
అక్షరాలు నడిచిన ప్రదేశం ఒంటరిగా తలుపులు బిగించుకొని 
మన చేతగాని తనాన్ని ప్రశ్నించిన తిక్కన మహా సముద్రము 


మహా మహా సత్య పురుషుడు తిరుగాడిన మట్టిమీద 
చల్లని గాలి కూడా జ్ఞాపకాలు మోసుకొని సోయగాలు పోయి 
చింత చెట్ల చిగురు బాల్యాన్ని గిలిగింతలు చేస్తుంది 
పచ్చని గడ్డితో పాతకాలపు ముచ్చట్లు పెట్టే
పసి నవ్వుల్ని పూయించే వృద్ధుల్ని వెంటేసుకున్న 
మౌనశక్తి కేంద్రం విరిసిన పల్లెపాడు గాంధీ ఆశ్రమ మహా సముద్రము 


అక్కడ నిలబడ్డాను...తన భాషలో తాను అంగలు వేసుకుంటూ కుంటూ 
ఒడ్డుకు వచ్చేసరికి ఒదిగిపోయి ,నా మనసును నురుగుతో కలిసి ,
తడిమి సుతారంగా వెనక్కి ...ఆకృతి లేని అలలు ,అవి పిలిచిన ఆలోచనలు 
దూరంగా చూస్తే నిశ్చింత ,ఎగుడు దిగుడులే లేని సమతల తళతళలు 
కొంచెం ముందర ఎగిసిపడే యవ్వనపు ఉబలాటాలు
నత్తగుల్లల చేమ్కీ అంచుల్లో పసిపాదాల మెత్తని ఇసుక అడుగులు 
మానవ జీవితాన్ని ప్రవచించే మహాశాస్త్రవేత్త  
ప్రపంచ దేశాల ప్రజలతో ఒకే భాషలో మాట్లాడే మహా సముద్రము 


చల్లని గుండె పలకరింత ,నా తప్పి పోయిన శరీర భాగం దొరికిందా!
ఆలింగనంలో స్పర్శకు పులకింత కలిగింది .
ఇటూ అటూ ఉత్సాహానికి వయసొచ్చి ఉరకలెత్తుతుంటే 
వయసు సిగ్గుతో తల దిన్చుకోక తప్పలేదు .
అనర్ఘల వాగ్ధాటి అందర్నీ వశపరుచుకొని తల్లికోడిలా
రెక్కలపోట్ట కిందికి నులి వెచ్చదనం తో కప్పుకుంది .
ప్రేమకు ఎన్ని ఋతువులో,ఎన్ని దిక్కులో,వెలువడే శక్తికి ఎంత పరిమళమో!
హద్దులు చెరిపిన భాస్కర కణాల పవిత్ర మహా ప్రేమ సముద్రము.  


                      .....

Thursday, July 19, 2012

తర్జుమా...



నీ దుఃఖపు చుక్కలు 
నాలోకి ఇంకితే 
మౌనం మొలకెత్తినా 
మనసు తడి ఆరదు


గిరి గీసుకొని 
కవచం లోపలికి జారుకుంటాను 


గవ్వగా 
ఆడుకోవచ్చు 


అది నా ఎండిన ఉనికి 


      .....

అంతే కానీ .....



అంతేలేని 
అంతేనని 


అంతని 
ఇంతని 


అంతా ఇంతేనని 


ఎంతా కాదని 


     .....

Wednesday, July 18, 2012

ఎప్పటికప్పుడు గుండె తడుపుకోవాలి



అంతా వెళ్ళిపోయాక 
అడుగులచప్పుడు గాల్లో లీనమయ్యాక
ముసురు తుఫాను మనసు 
ఎటూ పోలేక 


ఓ మూల ఒంటరిగా 
పిల్లి ముడుచుకున్న అవయవాలతో 
దేహం...
నేల మీద నడవని కనురెప్పల 
కాసేపు మూసి 


ఇక్కడినుంచి ఎటెల్లాలో 
పొట్టకూటికోసమో ,మరెవరి కోసమో 
ఈలోపునెవడో కట్టెతోనో 
తుపాకీతోనో 
ఓ చురకత్తి వాక్యం తోనో 
సమాప్తం చేయవచ్చు 


ఎలాగైనా ఈలోపు 
ఆలోచనల్ని ,దాన్ని చుట్టిన 
పువ్వుల గుభాళింపు బంధాల్ని 
పెనవేసుకున్న పచ్చదనాన్ని మాత్రం 
బతికించుకోవాలి.


    .....

Tuesday, July 10, 2012

నడక వెంట పడితే



కొన్ని ఆలస్యంగా తెలిసినా సరే 


నిక్కచ్చిగా నిను తూకం వేసి 
నీ సమర్ధత ఎన్ని మిల్లీమీటర్లకంటే తక్కువో కొలిచి 
సజ్జనుల ముందర 
నువు దాచుకోబోయిన 
శూన్యాన్ని నివేదించక మానవు.


అయితే 


ఒక్కడివే ఉన్నప్పుడు 
వేసే ప్రశ్నలకి ఉక్కిరి బిక్కిరై 
మందిలో ఒకడివై 
మరిచిపోయే ప్రయత్నాన్ని లాగి లాగి 
కొనసాగించుకొని తృప్తిగా 
ఆగిపోతావు .....ఆ రోజుకి 


బోరియల్లోకి,అక్కడినుండి చెట్లమీదికి,
ముల్లకంపల్లోకి,పూల తోటలోకి,
మల మూత్రాల వెంట 
నిను మోసపుచ్చిన కోరికల మీదుగా 
పచ్చని గడ్డి వాగుల వెంట 
విశాల మైన మర్రి నీడ మీదికి....


నిన్ను వెతుక్కుంటూ 
నీ వేయికాల్లనీ 
నీ అదనపు ముఖాల్నీ 
నీ అక్కరకు రాని చేతుల్ని 
దాటి వచ్చిన శిబిరాల్లో మరిచి వచ్చిన 
నటించిన చిత్రాల్ని 
ఎంత తిరగేసినా గుర్తుపట్టవు


తేనె మండలం పైకి 
భ్రమరాల ఆహ్వానాన్ని 
ఆశపడతావు
నీ మాధుర్యమే దోచబడుతుందని
ఎప్పుడు తెలుసుకుంటా..... వో.!


          ..... 

Sunday, July 8, 2012

ఉప్పల గట్టు జాతర



ఎన్నేండ్లయిందో
నీ ముఖం నాకు చూపించకో 
నాది నీకో 


ఉడుకుతున్న బువ్వ 
కలెబెట్ట్టినట్టు నిన్ను 
తలుచుకుంటె...


నిన్ను నువ్వు ఇంకా 
మార్చుకోక ముందే 
నీవు చూసిన నన్ను 
కుబుసం విడిచాను 


కళ్ళల్లోని వొత్తులు
అమాస చీకట్లని 
చిడతల మోతతో 
శ్శివ శ్శివ శ్శివ శ్శివ శ్శివ
గొంతులు వెంటపడి 
తరిమితే ఉరిమితే 
ఆకాశం తెల్లబోయింది గుర్తుందో 


గుండంలో వణికిన
బాల్యం
భుజమ్మీద 
కూచొని గిల్లడం మానలేదు 


గుండుకు రాయికి 
వయసొచ్చి పౌడరద్దుకొని 
జాగారాలు చెయ్యడం తెలిసి ,
జారుకుంటూ జార్చుకుంటూ చేరి 
నీ  ఎత్తైన కౌగిలి నుండి 
ఈ లోకాల లోయల్ని చూసాక కదా
భూమి ప్రేమికత్వం తెలిసింది 




మల్లొక్కసారి కొమ్మలు చాచు 
దారులు చీల్చు 




నీ లోపలి నీవు తడి పడతావో 
నా లోపలి నేను పూతకొస్తానో


       .....

Friday, July 6, 2012

మాయ''మ్''



ఈ రోజు 
నను రాకుండా 
గది గోడలు 
ముడుచుకు పోతే బాగుండు 


బలవంతంగానైనా సరే 
దభాల్న తలుపులు 
నను బయటకు నేట్టేస్తే సరి 


తప్పని సరిగా చేవుల్లోకిపారే 
ప్రపంచ శబ్దాలకి 
భస్మమైన అవయవాలకి 
తడిపి,నమ్మకం నాటుకోవాలి 


అయస్కాంతపు కాసుల్ని 
నిర్వీర్యం చేసి 
నిమజ్జనం చేసుకోవాలి 


ఆకలి మీద 
కంటి చినుకు చల్లి 
నిద్ర పుచ్చాలి 


ఈ రోజు 
ప్రపంచం కనిపించకుండా 
పిచ్చుక గూట్లో దాచుకుంటే బాగుండు 


      .....

Thursday, July 5, 2012

ఆత్మభంగం



అలా గాలికి పోతున్న నన్ను 
హత్తుకున్నాక,


ముఖాలు మాట్లాడే భాష 
మనతో చర్చకు దిగి 
మళ్లీ కలిసిన పిదప 


సౌందర్యానికి 
ఒక వ్యాకరణం మొదలుపెట్టాక 


తుఫానుకు  సర్దిచేప్పుకోలేని 
సందర్భాలు మొలకెత్తావ్ 


ఎవరితూకానికి 
ఎవరూదిగక


ఎవరివీపులు వారికి 
అపనమ్మకాన్ని మోసుకొచ్చాక


ఎవరిపతాకాల్లో వారికి 
వెలిసిపోయిన రంగుల్లా
రెపరెపలాడాక


ఏం?జరిగినట్టు 


    .....

Wednesday, July 4, 2012

ఈ నెల పాలపిట్ట లోని నా కవితలు


గుజ్జలాం ......(గులాబ్ జాం)



దాడీ...
ఒక*టోరి చెప్పనా!...(స్టోరి)


వొక రాజుంటడంట 
మూడమ్మాయిలు
పెద్దబ్బాయి 
వాళ్ళ కాకి ఫ్రెండు 
అయితే....ఆకలేస్తది
ఎపో.!.నువ్వు నవ్వుతున్నవ్ ...చెప్ప




ఎప్పుడు ఇంట్ల *చుక్కోవు     (*కూర్చోవు )
వుండొచ్చు గా...
పీజ్ దాడీ 
*లీల్లల్ల ఆడను                      (*నీళ్ళల్లో)
*ఓంకం మంచిగ చేస్త             (హోంవర్క్)




ఇన్ని *బుస్కులల్ల                (బుక్స్)
ఏమున్నది దాడీ 
ఏబీసీడీ లేనా ?




కోoప మొచ్చిందా ?
సారీ...
ఊకె కోమ్పమెందుకు 
మమ్మీ *ఈనకు.....                 (ఈయనకు)




మూతట్ల పెట్టినవ్?
ఏమైంది *పాచీ !                         (పరిచయ)   
అల్ల(ర్) చేయకు 
*నరకాలా!..                                (నకరాలా)




తొండకు 
ఆళ్ళ మమ్మీ దాడీ లేరా ?
ఎప్పుడొక్కటే చెట్టు మింద ...




*బకడీ ఆడుకుందామా దాడీ              (కబడ్డీ)
పోనీ *దొక్కిచ్చుకునే ఆట                   (దొరికిచ్చుకునే)
*దాతురూమ్ల                                    (బాత్ రూంల)
*దెద్ రూంల   దాచు కోవద్దు               (బెడ్ రూంల )




ఈ బుక్కేసుకో 
కమ్మగుంది కదా !
మమ్మి నాకిష్టం 
నువ్వు కూడా ఇష్టం దాడీ ...


ఎప్పుడు బస్సులనే 
(స్)కూల్ కు పోవాలా?
*ఎంపపాల్ ల పంపొచ్చుగా....!             (ఏరోప్లేన్)


రేపు నా *బత్తుడే                                 (బర్త్ డే )
*జిక్కుటు తేక పోయావో                       (గిఫ్ట్)
ఒళ్ళు *చింత పత్తైత(ద్)                        (చింత పండు)


నీకో *చాకెటి స్తా                                   (చాక్లెట్)
పండ(గ్) చేస్కో 
ఓ పోయెం రాస్కో ....




         .....
మిత్రులారా!ఇది మా నాలుగు సంవత్సరాల "ఆనంద స్వామి",
ఉండాల్సిన చోట ఒత్తులు జార్చుకొని ,అవసరం లేని చోట అలంకరించుకొని ,కిమ్మనక ఒదిగిపోయిన బాల్యం భాష.....పదాలు,వాక్యాలు వాడివే .....
నేను కూర్పరిని మాత్రమే,
వాడి పుట్టిన రోజుకై.